Yatra movie review

08 Feb,2019

యాత్ర రివ్యూ 

సంగీతం: కే
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి
రచన - దర్శకత్వం: మహి.వి.రాఘవ్
నటీనటులు: మమ్ముట్టి, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ, సచిన్ ఖేద్కర్, సుహాసిని,  పోసాని తదితరులు
విడుదల : 8-02-2019
రేటింగ్ : 3 / 5

‘మహానటి’ తర్వాత తెలుగులోనూ బయోపిక్ సినిమాల క్రేజ్ పెరిగింది. దాంతో ఆ దిశాగా  ఇటీవలే ‘యన్.టి.ఆర్ జీవిత కథతో కథానాయకుడు వచ్చేసింది. తాజాగా మహానేత గా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్తానం సంపాదించుకున్న   దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ యాత్ర ఎలా సాగిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .. 

కథ:

నాటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో  మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా చేసిన పాదయాత్ర ఆధారంగా  నాటి రాజకీయ సామాజిక పరిస్థితుల్ని చూపించడంతో మొదలవుతుందీ కథ. అప్పటి చంద్రబాబు సర్కారు ఎన్నికల్లో విజయంపై ధీమాతో ముందస్తుకు సిద్ధం కాగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదన్న భావనతో ఉంటారు. అలాంటి సమయంలో అసలు జనం సమస్యలేంటో.. వాళ్లు ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి వైఎస్ పాదయాత్ర మొదలుపెడతాడు. అలంటి సమయంలో కొన్ని సంఘటనల ప్రభావంతో వైఎస్సార్ పాదయాత్రను మొదలు పెడతారు. ఆ యాత్ర ప్రయాణంలో వైఎస్సార్ కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? ప్రజలు అప్పుడు ఏఏ సమస్యలతో బాధ పడుతున్నారు ? ఆ సమస్యల పరిష్కారలకు ఆయన ఎలా స్పందించారు ? చివరకి ప్రజల గుండెల్లో కొలిచే మహానేతగా ఆయన ఎలా ఎదగగలిగారు ? 2004 ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించగలిగారు ? ఈ క్రమంలో వైఎస్సార్ ఎదురుకున్న ఇబ్బందులు, అనుభవాలు ఏమిటి ? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
 
 నటీనటుల ప్రతిభ : 

ఈ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ మమ్ముట్టి. ఆయన  వైఎస్ పాత్రలో   ఒదిగిపోయిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. బాడీ లాంగ్వేజ్ - డైలాగ్ డెలివరీ విషయంలో వైఎస్ ను అనుకరించడం కాకుండా.. పాత్ర తాలూకు ఆత్మను పట్టుకోవడనికే ప్రయత్నించారు మమ్ముట్టి. ఇక్కడే నటుడిగా ఆయన గొప్పదనం ఏంటన్నది అర్థమవుతుంది. ఇది వైఎస్ మీద తీసిన సినిమా అయినప్పటికీ.. ఆయన అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులు కూడా కొంతమేర సినిమాలో ఇన్వాల్వ్ కావడానికి మమ్ముట్టి కారణమవుతాడు. సేహ్నం ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు, క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి. మొత్తానికి మంచి ఎమోష‌న‌ల్ కంటెంట్‌ తో దర్శకుడు ప్ర‌తి ప్రేక్ష‌కుడి గుండెను టచ్ చేస్తాడు. మిగతా నటీనటులకు పెద్ద పాత్రలేమీ లేవు. కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్.. వైఎస్ సతీమణి విజయమ్మగా సుశ్రిత.. సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని తదితరులు ఆయా పాత్రల్లో బాగానే ఒదిగిపోయారు. సచిన్ ఖేద్కర్, పృథ్వీ,  పోసాని లాంటి వాళ్లు జస్ట్ ఓకే అనిపించుకున్నారు.

టెక్నీకల్ హైలెట్స్ :

టెక్నీకల్ పరంగా మంచి స్థాయిలోనే కనిపిస్తుంది. కే సినిమాకు తగ్గ  సంగీతం అందించాడు. పాటలు , నేపథ్య సంగీతం  ఎమోషనల్ గా సాగుతాయి. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం కూడా బాగుంది.  ఎడిటింగ్ విషయంలో సందేహాలు ఎమిలేవు.  నిర్మాణ విలువలకు ఢోకా లేదు.  మహి.వి.రాఘవ్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. వైఎస్ గురించి తానేం చెప్పదలుచుకున్నాడో అది ఒక కన్విక్షన్ తో చెప్పే ప్రయత్నం చేశాడు.  ఎమోషనల్ సీన్స్ ను అతను డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. కాకపోతే కథ విషయంలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ విషయంలోనే అందరికి నచ్చుతుందా అన్న డౌట్ కనిపిస్తుంది. 

విశ్లేషణ : 
 
ఈ సినిమా  వైఎస్ బయోపిక్ కాదు, కేవలం ఆయన రాజకీయ జీవితంలో అత్యత కీలకంగా నిలిచిన పాదయాత్ర చుట్టూ నడిచే ఒక ఎమోషనల్ జర్నీ మాత్రమే. కేవలం ఈ యాత్ర చుట్టూ కథ అల్లి సినిమాగా తీయాలనుకోవడం సాహసమే. వైఎస్ ను గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తారన్నది ఊహించిన విషయమే. పాదయాత్ర ద్వారా వైఎస్ ఒక నాయకుడిగా ఎలా పరిణామం చెందాడన్న విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ‘యాత్ర’. వైఎస్ అమలు చేసిన ప్రధానమైన సంక్షేమ పథకాల ఆలోచన ఎలా పుట్టిందో తెర మీద ప్రభావవంతంగా చూపించాడు మహి.వి.రాఘవ్. వ్యవసాయాన్ని నమ్ముకుని రైతులు ఎంత దయనీయ స్థితికి చేరిన వైనాన్ని చూసి చలించిపోయి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించడం.. ఆసుపత్రిలో ఒక చిన్నారి మరణానికి కదిలిపోయి ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేయడం.. ఇంకా ఫీజు రీఎంబర్స్ మెంట్ అర్హులందరికీ పింఛను లాంటి పథకాల దిశగా వైఎస్ అడుగులు వేయడం లాంటి విషయాల్ని ‘యాత్ర’లో హైలైట్ చేశాడు. వైఎస్ పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందు కథను నడిపించిన విధానం ఆసక్తి రేకెత్తిస్తుంది.  యాత్ర’ను ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు.  అదిష్టానాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా పాద‌యాత్రను ప్రారంభించిన జ‌న‌నేత‌గా, మ‌హ‌నేత‌ వైఎస్ పాద‌యాత్రకు సంబంధించి చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా సాగించాడు. మంచి ఎమోషనల్ గా సినిమాని నడిపిన దర్శకుడు అక్కడక్కడ కొన్ని సీన్స్ లో ఆ ఎమోషన్ని ఆ స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయాడు. కొన్ని చోట్ల బోర్ కొట్టించాడు కూడా. పైగా సినిమాటిక్ శైలిని ఊహిచుకుని వెళితే మాత్రం నిరాశ తప్పదు . రెగ్యూలర్ కమర్షియల్ అంశాలు పెట్టకుండా దర్శకుడు తను అనుకున్న ఎమోషనల్ డ్రామానే ఎలివేట్ చేయటానికే ఆసక్తి చూపారు. తెలుగుదేశం పార్టీ మీద అక్కడక్కడా సెటైర్లు పడ్డాయి. ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు మార్క్ ‘బ్రీఫ్డ్ మి’ పదం ఎలా పాపులర్ అయిందో  దీన్ని ఇందులో వాడుకుని సెటైర్ వేశారు.  సినిమాలో చంద్రబాబును చూపించలేదు కానీ.. ఆయన ప్రస్తావన మాత్రం ఉంది. విశేషం ఏంటంటే ఈ సినిమాలో  తెలుగుదేశం పార్టీ కంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని విలన్ లాగా చూపించడం విశేషం.  ఐతే వైఎస్ ను అభిమానించే   వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా.  
 

Recent reviews